నా ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్: రాహుల్

వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు చెప్పానని సూరత్‌లో విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేననీ, దేశంలోని యువతకు తాను చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 2:57 pm

వేర్పాటువాదులకు సోనియా పిలుపు

జమ్మూ- కాశ్మీర్ వేర్పాటువాదులు ప్రజాస్వామ్య స్రవంతిలో కలిసి పోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్ పాల్గొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. ఈ విషయాన్ని వేర్పాటువాదులు గుర్తు పెట్టుకోవాలన్నారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 2:14 pm

"ప్రేమ జంట"లకు బలవంతపు పెళ్ళిళ్లు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రేమ జంటలకు భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంఘ్ పరివార్‌ సంస్థలు బలవంతపు పెళ్లిళ్లు చేశాయి. దీంతో జంట నగరాలతో సహా, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన పార్కుల్లో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 10:33 am

చిరంజీవి - దేవేందర్‌లపై తెదేపా విమర్శలు

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, నవ తెలంగాణా రాష్ట్ర పార్టీ దేవేందర్ గౌడ్‌లపై తెలుగుదేశం పార్టీ నేతలు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సన్యాసి.. సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు చిరంజీవి, దేవేందర్ గౌడ్‌లు రాసుకుంటే.. రాలేది బూడిదేనని తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి సున్నాలు మినహా మరేమి మిగలదని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 10:20 am

ఓసీ విద్యార్థులకూ ఉపకారవేతనాలు: వైఎస్

తాము మళ్లీ అధికారంలోకి వస్తే అగ్రవర్ణ కులాలకు చెందిన విద్యార్థులకు సైతం ఉపకారవేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కల్పిస్తామని శనివారం ఆయన ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా వైఎస్‌ మంగళగిరిలో రూ.30 కోట్లతో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 10:07 am

పబ్ సంస్కృతికి సుష్మా స్వరాజ్ మద్దతు

దేశంలో నానాటికి పెరిగిపోతున్న పబ్ సంస్కృతికి భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్ మద్దతు తెలిపారు. పబ్‌లకు వెళ్లే యువతులపై దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా.. కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో శ్రీరామ్ సేన కార్యకర్తలు సృష్టించిన వీరంగంపై ఆమె నిప్పులు చెరిగారు. తాను ఇటువంటి చర్యలను పూర్తిగా వ్యతిరేకిని. లండన్‌లో ఉన్న తన కుమార్తె కూడా పబ్‌కు వెళుతుంటుందని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 8:09 am

చిరు వ్యాఖ్యలు "నేతిబీర" చందం: బాబు

సామాజిక న్యాయాన్ని వల్లె వేస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యలు నేతిబీరకాయలాంటివని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని ఆయన గుర్తు చెప్పారు. అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు తెదేపాకు మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 7:42 am

కాశ్మీర్‌లో నేటి నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

కాశ్మీర్ ప్రజలకు అంతర్జాతీయ విమానయాన సౌకర్యం అందుబాటులోకి శనివారం నుంచి రానుంది. రూ.60 కోట్ల రూపాయల వ్యవయంతో పూర్తిచేసిన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమాన సేవలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రారంభించనున్నారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 7:20 am

చేతులు కలుపనున్న కాంగ్రెస్-తృణమూల్

వచ్చే సార్వత్రిక ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీలతో స్నేహ హస్తం ఇచ్చిపుచ్చుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. ముఖ్యంగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అంశాన్ని ఖరారు చేసేందుకు బెంగాల్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం శనివారం జరుగనుంది.
Source: జాతీయ | 14 Feb 2009 | 6:52 am

కాంగ్రెస్-కళ్యాణ్‌లదే నైతిక బాధ్యత: అమర్ సింగ్

బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్ర నాటి ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్‌లే బాధ్యత వహించాలని సమాజ్‌వాది పార్టీ ప్రధానకార్యదర్శి అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి, ఇరు పార్టీల మధ్య ఉన్న సత్‌సంబంధాలు చెదిరిపోవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 6:36 am

చిదంబరం వ్యాఖ్యలపై నరేంద్ర మోడీ ఆగ్రహం

గుజరాత్ ముఖ్యమంత్రికి పాకిస్థాన్‌‌తో ఉన్న లింకు ఏమిటో వెల్లడించాలని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తన మాటలకు పెడర్ధాలు తీయడం మాని ముంబై మారణహోమంలో పాలుపంచుకున్న ఇంటి దొంగలను పట్టుకునేందుకు చిదంబరం దృష్టి సారించాలని ఆయన చురక అంటించారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 5:48 am

ముగిసిన మెగాస్టార్ గుంటూరు యాత్ర

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గుంటూరు జిల్లా పర్యటన శుక్రవారం రాత్రితో ముగిసింది. మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రజా అంకిత యాత్రలో చిరంజీవికి జిల్లా వాసులు నీరాజనం పలికారు. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల పరిధిలో చిరంజీవి యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 5:11 am

రాష్ట్రానికి వస్తున్న లోక్‌సభ స్పీకర్ సోమనాథ్

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా శ్రీరాంసాగర్ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం జిల్లాలోని బాల్కొండ మండలంలోని జలాల్‌పూర్‌లో రూ.53 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 4:59 am

దౌత్య సంబంధాలు తెంచుకోవాలి: భాజపా

పాకిస్థాన్‌తో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకోవాలని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ మెడలు వంచేందుకు అంతర్జాతీయ సమాజం ద్వారా ఒత్తిడి తేవాలని కోరింది. అప్పటికీ పాక్ వ్యవహారశైలిలో మార్పు రాకుంటే పాక్‌తో ఉన్న దౌత్య, వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 14 Feb 2009 | 4:07 am

అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులకే టిక్కెట్లు: డీఎస్

వచ్చే అసంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో స్థానికేతరులకు టిక్కెట్లు కేటాయించరాదని శుక్రవారం జరిగిన పిసిసి ఎన్నికల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 3:42 am

కోరమాండల్ రైలు ప్రమాదం: 16కు చేరిన మృతులు

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేసి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఒరిస్సా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి చెన్నైకు వెళుతున్న కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని 18 బోగీలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకుంది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Source: జాతీయ | 14 Feb 2009 | 3:25 am